అమరావతి (ప్రజా సీమ)
డాక్టర్ అంబేద్కర్ కేవలం ఒక కుల నాయకుడు మాత్రమే కాదు, ఆయన భారతదేశానికి దిక్సూచిగా నిలిచిన మహానుభావుడు అని హైకోర్టు న్యాయవాదులు తెలియజేశారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా వారు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కాకుండా, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛలకు ప్రతీకగా నిలిచిన మహనీయుడు. భారత సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించాలనే సంకల్పంతో ఆయన జీవితాంతం పోరాటం చేశారన్నారు.అంబేద్కర్ గారి దృష్టిలో విద్యే సమాజాన్ని మారుస్తుందనే నమ్మకం ఉండేదనీ, అందుకే వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విద్యను ప్రధాన ఆయుధంగా భావించి, వారికి అవకాశాలు కల్పించే దిశగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. ఆయన చూపిన మార్గం నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచడంలో అంబేద్కర్ పాత్ర అపారమైనది. సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే విలువలను భారత రాజ్యాంగంలో ప్రతిష్టించి, దేశ ప్రజలకు గౌరవప్రదమైన జీవన విధానాన్ని అందించారు. ఆయన ఆలోచనలు నేటికీ సమాజ నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్నాయి అని,అందువల్ల అంబేద్కర్ ని ఒక కుల నాయకుడిగా కాకుండా, దేశ నాయకుడిగా గుర్తించడం ప్రతి భారతీయుడి బాధ్యత. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమానత్వ సమాజ నిర్మాణానికి అందరం కట్టుబడి ఉండాలని పిలుపునిస్తున్నామనీ హైకోర్టు న్యాయవాదులు కే. సాయిప్రతాప్,ఎం. శివ ప్రసాద్,బి. కిరణ్ తదితరులు తెలియజేశారు.
–

