ఎన్ఎంఈఓ-ఓపీ పథకం కింద ఆయిల్ పామ్ సాగు విస్తరణపై ఉద్యాన రైతులకు అవగాహన సమావేశం
రైల్వేకోడూరు ప్రజా సీమ
తిరుపతి జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు మండలం అబ్బినాయుడు పల్లి గ్రామంలో జాతీయ తినదగిన నూనెల మిషన్ – ఆయిల్ పామ్ పథకం కింద ఆయిల్ పామ్ సాగు విస్తరణపై ఉద్యాన రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి, తిరుపతి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రస్తుతం మామిడి సాగులో ఎదురవుతున్న వాతావరణ మార్పులు, ధరల హెచ్చుతగ్గులు వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్ పంట రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే ప్రత్యామ్నాయ వాణిజ్య పంటగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం రైల్వే కోడూరు ఉద్యాన ఉద్యాన పరిశోధన స్థానం, అనంతరాజుపేట శాస్త్రవేత్త డా. తనుజ ఆయిల్ పామ్ సాగులో భూమి ఎంపిక, గుంతల తయారీ, నాటే దూరం, నాణ్యమైన మొక్కల ఎంపిక, నీటి యాజమాన్యం, ఎరువుల నిర్వహణ, అంతర పంటల సాగు, పురుగు–వ్యాధుల నియంత్రణ, అధిక దిగుబడులు సాధించే ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు సమగ్రంగా వివరించారు.డా. యోహన్, శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధన స్థానం, అనంతరాజుపేట వారు ఎల్ నినో ప్రభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉద్యాన పంటలలో అవలంబించాల్సిన పద్ధతులను రైతులకు వివరించారు.రైల్వే కోడూరు ఉద్యాన అధికారి ఎం. వెంకట భాస్కర్ ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా ఆయిల్ పామ్ సాగుకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి రైతులకు వివరించారు. ప్రభుత్వం గుర్తించిన మండలాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టిన రైతులకు క్రింది ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఎకరానికి సుమారు రూ.10,000 విలువైన ఆయిల్ పామ్ మొక్కలను ఉచితంగా అందజేస్తారు.మొదటి నాలుగు సంవత్సరాల పాటు సాగు నిర్వహణ ఖర్చుల కోసం ఎకరానికి సంవత్సరానికి రూ.2,100 ఆర్థిక సహాయం అందజేస్తారు.అంతర పంటల సాగును ప్రోత్సహించేందుకు ఎకరానికి సంవత్సరానికి రూ.2,100 చొప్పున ప్రోత్సాహకం అందజేస్తారు.ఆయిల్ పామ్ తోటలలో బిందు సేద్య (డ్రిప్ ఇరిగేషన్) పరికరాలకు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సేద్య పథకం ద్వారా రాయితీ కల్పిస్తారు.ఆయిల్ పామ్ తాజా గెలల ధరలను ప్రతి నెల ప్రభుత్వం నిర్ణయించడం వల్ల దళారీల ప్రమేయం లేకుండా రైతులకు పారదర్శకమైన ధరలు లభిస్తాయి అని వివరించారు.అనంతరం సువెన్ అగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వెంకట రమణ రెడ్డి గారు మాట్లాడుతూ, సంస్థ రైతులకు నాణ్యమైన మొక్కల సరఫరా, సాంకేతిక మార్గదర్శకత్వం, పంట నిర్వహణలో సహాయం మరియు రైతులు ఉత్పత్తి చేసిన తాజా గెలలను కొనుగోలు చేసే విధానంపై వివరించారు.ఈ కార్యక్రమంలో సువెన్ అగ్రో ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ శ్రీ కొండారెడ్డి గారు, ఉద్యానశాఖ గ్రామ ఉద్యాన సహాయకులు ఉదయభాను, శ్రావణ కీర్తి, దినేష్ మరియు ఉద్యాన రైతులు పాల్గొన్నారు..

