ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఇంటింటికీ టిడిపి(డోర్ టు డోర్)కార్యక్రమంలో బిజీబిజీగా కొమ్మా శివ
రైల్వేకోడూరు ప్రజాసీమ
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ‘ఇంటింటికీ టిడిపి'(డోర్ టు డోర్)కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొమ్మా శివ ప్రతిరోజు విస్తృతంగా పర్యటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గార్ల పర్యవేక్షణలో సాగుతున్న ఈ కార్యక్రమంలో కొమ్మ శివ స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటి ఇంటికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా కొమ్మా శివ మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షుడిగా పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్విరామంగా నిర్వహిస్తున్నానని, ప్రజల మధ్య ఉంటూ సేవ చేయడమే తన ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.డోర్ టు డోర్ పర్యటనలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని తెలిపారు. చిన్న చిన్న సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే ఇతర ముఖ్యమైన సమస్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి, వాటికి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేస్తున్నామని వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రజాదరణ లభిస్తోందని, రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజల నుండి కూటమి ప్రభుత్వానికి విశేషమైన స్పందన, మద్దతు లభిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు, కూటమి భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.

