గాలివీడు మార్చి 22 (ప్రజా సీమ విలేకరి):
మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం గాలివీడు మండలం గోరాన్ చెరువు గ్రామం బుట్టిగారిపల్లి సమీపంలో కిరణ్ కుమార్ రెడ్డి టమోటా తోటను, అలాగే గాలివీడు గ్రామ పరిధిలోని నడింపల్లి గ్రామానికి చెందిన టి. హరికృష్ణ మామిడి తోటను సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో టమోటా, మామిడి తదితర పంటలు పూర్తిగా నాశనం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కష్టపడి సాగు చేసిన పంటలు కళ్లముందే నాశనం కావడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.పంట నష్టాలపై వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ఇంకా సరైన అంచనా వేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వెంటనే అధికారులను రంగంలోకి దింపి పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు తగిన పరిహారం ప్రకటించాలని, పంట బీమా క్లెయిమ్‌లను ఆలస్యం లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు.అదనంగా రైతులకు ఉచిత విత్తనాలు, ఎరువులు అందించి తిరిగి సాగుకు సహకరించాలని, బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని కోరారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు షజీల్ అహమ్మద్, పి. కృష్ణమూర్తి, రైతులు కిరణ్ కుమార్ రెడ్డి, టి. హరికృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

