ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి ---- తొలగించిన శానిటేషన్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి --...

హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి —- తొలగించిన శానిటేషన్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి — జిల్లా కలెక్టర్‌కు సిఐటియు వినతి

📰 Generate e-Paper Clip

 

అనంతపురం మార్చి 16(ప్రజా సీమ ప్రతినిధి)

అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరియు అనుబంధ ఆసుపత్రుల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులను వయోపరిమితి మరియు విద్యార్హతల పేరుతో అక్రమంగా తొలగించడం తీవ్ర అన్యాయమని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేసి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీ ఓ. ఆనంద్, ఐఏఎస్ గారికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న శానిటేషన్ కార్మికులను వయస్సు మరియు విద్యార్హతల పేరుతో తొలగించడం పేద కార్మిక కుటుంబాలను వీధులపాలు చేసే చర్యగా ఉందన్నారు. ఈ తొలగింపులను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా WP No.36498 of 2025 కేసులో 31-12-2025న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి కార్మికుల వినతిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు 50 సంవత్సరాల వయస్సు లేదా విద్యార్హతల పేరుతో శానిటేషన్ కార్మికులను తొలగించరాదని పేర్కొన్నట్లు తెలిపారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 24-02-2026న జారీ చేసిన ఆదేశాల్లో కూడా హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించినట్లు చెప్పారు. అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం కూడా 07-03-2026న సంబంధిత కాంట్రాక్ట్ సంస్థకు ఈ ఆదేశాలను అమలు చేయాలని లేఖ పంపినప్పటికీ ఇప్పటివరకు కార్మికులను పూర్తిగా విధుల్లోకి తీసుకోలేదని విమర్శించారు.

అందువల్ల హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేసి అక్రమంగా తొలగించిన శానిటేషన్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వయోపరిమితి మరియు విద్యార్హతల పేరుతో కార్మికులపై జరుగుతున్న అన్యాయ చర్యలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్, నగర కార్యదర్శి ముత్తుజ, శానిటేషన్ కార్మికులు నాగేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!