వాసవీమాత శరన్నవరాత్రి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండ్యాల విజయ్ కుమార్ ఆహ్వానం
రైల్వేకోడూరు ప్రజాసీమ
రైల్వే కోడూరులోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. పరాభవ నామసంవత్సర ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ ద్వాదశి వరకు, అనగా అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 22 వరకు జరుగును.
రైల్వేకోడూరు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పెండ్యాల విజయ్ కుమార్ భక్తులందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు. పన్నెండు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ప్రతిరోజూ ఉదయం పంచామృతాభిషేకాలు, పూజాదికాలు, మధ్యాహ్నం సమారాధనలు నిర్వహించనున్నారు. రాత్రి వేళల్లో జగన్మాత వివిధ దివ్య అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అక్టోబర్ 11న దీక్షాబంధన అలంకారంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో వరుసగా జగన్మోహిని, అన్నపూర్ణ, వనవిహారిణి, గజలక్ష్మి, సరస్వతి, గౌరీదేవి, మహిషాసుర మర్ధిని, కాళింగమర్ధిని, మహాలక్ష్మి, వాసవాంబదేవి, శయ్యాలంకారాలతో అమ్మవారు కొలువుదీరనున్నారు. విశేషంగా అక్టోబర్ 19న చండీహోమం, అక్టోబర్ 20న విజయదశమి పర్వదినాన సర్వగ్రామదేవతల కొలువు, శమీపూజ, లక్ష్మీపూజ ఘనంగా జరగనున్నాయి. అక్టోబర్ 22న వసంతోత్సవంతో ఉత్సవాలు మంగళప్రదంగా ముగుస్తాయి.
ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పెండ్యాల విజయ్ కుమార్ నాయకత్వంలో, ప్రధాన కార్యదర్శి కలువ మురళీధర్, కోశాధికారి పెడబల్లె సుబ్బారావు మరియు కార్యవర్గ సభ్యులు, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు, మహిళా మండలి సభ్యులు ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కావున రైల్వేకోడూరు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు ఈ దసరా శరన్నవరాత్రి లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

