బొమ్మవరంలో తొంభై వేలకు గణనాథుని లడ్డూ దక్కించుకున్న టిడిపి గడ్డం చెంగల్ రాజు
రైల్వేకోడూరు ప్రజాసీమ
రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం బొమ్మవరం గ్రామంలో వినాయక చవితి నిమజ్జన ఉత్సవాలు అత్యంత కోలాహలంగా, నేత్రపర్వంగా జరిగాయి. మూడవ రోజు వేడుకల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన లడ్డూ వేలం పాట భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ వేలంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు గడ్డం చెంగల్ రాజు రూ. 90,000లకు లంబోదరుని దివ్య ప్రసాదమైన లడ్డూను దక్కించుకున్నారు. స్వామివారి ప్రసాదాన్ని పొందేందుకు భక్తులు పోటీ పడటంతో వాతావరణం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.
అంతకుముందు గణనాథునికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, అనంతరం స్వామివారి విగ్రహాన్ని గ్రామంలోని ముఖ్య వీధుల గుండా వైభవంగా ఊరేగించారు. ఊరేగింపు పొడవునా పసిపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొని సంబరాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు వసంతాలు చల్లుకుంటూ, కుంకుమలు పూసుకుంటూ, భాజాభజంత్రీలు, కోలాటాలు, భక్తుల జయజయధ్వనుల నడుమ గ్రామాన్ని మంగళమయంగా మార్చేశారు. ఈ వేడుకల అనంతరం బొజ్జ గణపయ్యను భక్తిశ్రద్ధలతో జలప్రవేశం చేయించారు.
ఈ కోలాహలంలో నాయకులు శకునాల నరసింహులు, గంగాధర్, చేర్ల శంకర్ రాజు, ఉమ్మల రాజు, పిచ్చి రాజు, చక్రవర్తుల సుబ్బరాజు, శకునాల చిన్నప్ప రాజు, వెలిగెళ్ళ శివరాజు, శకునాల తిరుమల రాజు, ప్రదీప్ రాజు, శకునాల వర్మలతో పాటు గ్రామంలోని యువత, మహిళలు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.

