ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జనగణన..!!

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జనగణన..!!

📰 Generate e-Paper Clip

కడప, మార్చి 23 : ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2027 జనాభా గణనను సమగ్రంగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మరియు జిల్లా గణన అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో భారత సెన్సస్–2027 జనగణన కార్యక్రమం నిర్వహణకు సంబంధించి.. మూడవ స్థాయి శిక్షణలో భాగంగా ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమానికి డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్వో మాట్లాడుతూ.. మే 1 నుండి 30 వరకు నిర్వహించనున్న జిల్లాలో జరగనున్న సర్వే కి సంబంధించి ఫీల్డ్ ట్రైనర్స్ కు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 2027 జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన మరియు రెండవ దశలో జనాభా గణన నిర్వహించబడుతుందన్నారు. రెండవ దశలో కుల గణన కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. మొదటి దశను మే 1 నుంచి మే 30 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ దశలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, త్రాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం, అలాగే రేడియో, టెలివిజన్, స్మార్ట్ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు తదితర సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 33 ప్రశ్నల వివరాలను ఎన్యుమరేటర్ ప్రతి ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని వివరించనున్నట్లు తెలిపారు. అలాగే, ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకొనే విధముగా ప్రత్యేక పోర్టల్ 15 రోజులు ముందుగానే అందుబాటులో వుంటుందన్నారు. సాంకేతిక ఆధారిత డేటా సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డిజిటల్ సాంకేతికతల్లో సమాచార సేకరణ, డేటా ఎంట్రీలో ఖచ్చితత్వం, ఫీల్డ్ స్థాయి ధృవీకరణ ప్రక్రియలు వంటి వాటికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఆధునిక సాఫ్ట్‌వేర్ వ్యవస్థల వినియోగంతో పారదర్శకత, వేగం, విశ్వసనీయత పెరుగుతాయని నిపుణులు వివరించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో సెన్సెస్ ఆఫ్ ఇండియా విభాగం నుండి ప్రత్యేక అధికారుల ద్వారా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో నిర్వహించే జనగణన సర్వే నిర్వహణపై జిల్లా, మున్సిపల్, ఛార్జ్ లెవెల్ సెన్సెన్ సర్వే నిర్వాహకులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఈ శిక్షణలో జనాభా గణన జిల్లా ఇంచార్జి మరియు మాస్టర్ ట్రైనర్ మోహన్ రమణ మాట్లాడుతూ ఫీల్డ్ ట్రైనర్స్ విధివిధానాలు మరియు భాద్యతల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నట్లు తెలిపారు. 15 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జన గణన కార్యక్రమం 2027 ఇప్పటి వరకు 16 గణాంక సర్వేగా నమోదవుతుందన్నారు. స్వాతంత్య్రానంతరం 1952 మొదటగా ప్రారంభం కాగా ప్రస్తుతం 8వ జన గణన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోంది. రూ. 13 వేల కోట్ల అంచనా వ్యయంతో.. 16 ప్రాంతీయ భాషల్లో డిజిటల్ విధానంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించడం జరుగుతోందన్నారు. కడప జిల్లాకు సంబంధించిన మొత్తం 98 మంది ఫీల్డ్ ట్రైనర్లు ఈ శిక్షణలో పాల్గొంటున్నారన్నారు. వీరు శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం, ఏప్రిల్ నెలలో మండల స్థాయిలో ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. కాగా మాస్టర్ ట్రైనర్లు ప్రొఫెసర్లు శ్రీనివాసులు, సుదర్శన్ రెడ్డి, ఆదిలక్ష్మి, ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనగణన ఇన్‌చార్జ్ మోహన్ రమణ, డిప్యూటీ కలెక్టర్ కిరణ్ కుమార్. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!