అమరావతి : నేటితరం విద్యార్థుల పై ఒత్తిడిని తగ్గించడానికి ,వారి భద్రతను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ కోచింగ్ సంస్థల నియంత్రణ, పర్యవేక్షణ నిబంధనలు-2026″ తీసుకువస్తోంది.దీనికి సంబంధించిన ముసాయిదా సిద్ధమైంది.
ముఖ్యమైన నిబంధనలు ఇవే :
సమయ పాలన: కోచింగ్ సెంటర్లలో బోధన రోజుకు5 గంటలకుమించకూడదు.
పాఠశాలలు, జూనియర్ కళాశాలల పనివేళల్లో కోచింగ్ తరగతులు నిర్వహించకూడదు.
సెలవు:విద్యార్థులకు ఖచ్చితంగా ఆదివారం సెలవు ఇవ్వాలి.
రిజిస్ట్రేషన్ : 50 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రతి కోచింగ్ సెంటర్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
నిబంధనలు అమలులోకి వచ్చిన మూడు నెలల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
ర్యాంకుల ప్రదర్శనపై నిషేధం : విద్యార్థుల మార్కులు, ర్యాంకులు, ఫోటోలను నోటీసు బోర్డులు లేదా వెబ్‌సైట్లలో ప్రదర్శించకూడదు.
ఫీజు వాపసు :విద్యార్థి మధ్యలో వెళ్ళిపోతే, 10 రోజుల్లోపు మిగిలిన ఫీజును (ప్రో-రాటా పద్ధతిలో) వెనక్కి ఇచ్చేయాలి.
సదుపాయాలు : ఆత్మహత్యల నివారణకు గదుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లుఏర్పాటు చేయాలి.
ప్రతి 5 గురు విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి, 10 మందికి ఒక స్నానాల గది ఉండాలి.
సీసీటీవీ కెమెరాలు, 24 గంటల సెక్యూరిటీ ఉండాలి.
మానసిక ఆరోగ్యం:విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం కౌన్సిలింగ్ సదుపాయం ఉండాలి.
నిర్వహణ , పర్యవేక్షణ:
జిల్లా స్థాయి కమిటీ : కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తుంది.
వీరు ఎప్పుడైనా తనిఖీలు నిర్వహించవచ్చు.
ఫిర్యాదుల విభాగం : విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేక డిజిటల్ పోర్టల్ కలెక్టరేట్లలో డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేస్తారు.
పరిధి : జేఈఈ, నీట్, ఈఏపీసెట్ వంటి పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లతో పాటు ట్యూషన్లు, క్రీడలు, నృత్యం, సంగీతం వంటి శిక్షణ ఇచ్చే సంస్థలన్నీ ఈ నిబంధనల కిందకు వస్తాయి.
శిక్షలు , జరిమానాలు :
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి:
1. మొదటిసారి:₹50,000 జరిమానా.
2.రెండోసారి:₹1 లక్ష జరిమానా.
3.మూడోసారి:రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.
సంస్థ నిర్లక్ష్యం వల్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు రుజువైతే వెంటనే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.

