3.5 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు అరెస్ట్, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
యువత భవిష్యత్తును రక్షించడం, కుటుంబాలను మాదకద్రవ్యాల దుష్ప్రభావాల నుండి కాపాడడం మరియు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం తిరుపతి జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోంది. జిల్లా ఎస్పీ . సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ ఆర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో మరియు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో రేణిగుంట సబ్-డివిజన్ వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలు మరియు విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.ఈ క్రమంలో, చిట్వేల్ మండల పరిధిలోని చెర్లోపల్లి బ్రిడ్జి సమీపంలో విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కోడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి. శ్రీనివాసులు, చిట్వేల్ ఎస్‌ఐ వినోద్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది అరెస్ట్ చేశారు.
ఈ ఆపరేషన్‌లో నిందితుల వద్ద నుండి 3.5 కిలోల గంజాయి, 1,000 రూపాయలు నగదు మరియు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అరెస్ట్ చేయబడిన నిందితులు ఇద్దరు నిందితులు. మోపూరి నవీన్ కుమార్ వాకా రామ్మోహన్ రెడ్డి ను అరెస్టు చేసి పరారీలో ఉన్న నిందితుడు గుండు నువ్వు కూడా త్వరలో పట్టుకుంటామన్నారు.ప్రాథమిక విచారణలో నిందితులు గంజాయిని సేకరించి పరిసర గ్రామాలు మరియు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. విచారణలో భాగంగా గంజాయి సరఫరా వ్యవస్థకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమ వ్యాపారం వెనుక ఉన్న వ్యక్తులు, సరఫరా మార్గాలు మరియు సంబంధిత నెట్‌వర్క్‌ను పూర్తిగా వెలికితీసేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి.
ఈ సందర్భంగా జిల్లా పోలీసులు మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు వ్యక్తుల ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబాల ప్రశాంతతను, యువత భవిష్యత్తును మరియు సమాజ భద్రతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వ్యసనం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థిక, సామాజిక మరియు మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ సమస్యను అరికట్టడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లల స్నేహితులు, అలవాట్లు మరియు రోజువారీ కార్యకలాపాలపై శ్రద్ధ వహించాలని, ఉపాధ్యాయులు మరియు సమాజ పెద్దలు యువతలో అవగాహన కల్పించాలని సూచించారు. యువత తమ లక్ష్యాలు, విద్య, ఉపాధి మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించి మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని కోరారు.మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.మాదకద్రవ్యాలకు ‘నో’ చెప్పండి – ఆరోగ్యకరమైన కుటుంబాన్ని, సురక్షితమైన సమాజాన్ని నిర్మిద్దాం. యువతను కాపాడటం అంటే భవిష్యత్తును కాపాడటమే.