prajaseema.com
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 5:51 pm Digital Edition : PRAJA SEEMA

రెడ్డివారిపల్లిలో డ్రైనేజీ వ్యవస్థ పట్టించుకోని అధికారులు

రైల్వేకోడూరు  న్యూస్

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంరెడ్డివారిపల్లి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా నిర్మించాల్సిన డ్రైనేజీ వ్యవస్థ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు శాపంగా మారుతోంది. రెడ్డివారిపల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. సరైన పద్ధతిలో, నాణ్యతా ప్రమాణాలతో డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగునీరు సాఫీగా వెళ్లకుండా రివర్స్‌లో రోడ్లపైకి వస్తోంది. దీంతో గ్రామంలోని ప్రధాన రోడ్లన్నీ మురికి కూపాలుగా మారి, దుర్వాసనతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.గతంలోనూ తప్పని ఇబ్బందులు.కాంట్రాక్టర్ చేసిన నాసిరకం పనుల వల్ల గతంలోనూ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో సమస్య తీవ్రతను గుర్తించిన గ్రామ పెద్దలు శ్రీకారం శివయ్య బ్రదర్స్  చొరవ తీసుకొని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సొంత నిధులతో డ్రైనేజీ పనులను చేపించి కొంతవరకు ఉపశమనం కల్పించారు. పెద్ద మనసుతో ఆయన సొంత డబ్బులు వెచ్చించి చేసిన ఆ సహాయాన్ని గ్రామస్థులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు.

చిన్న పైపులతో మళ్లీ మొదటికే మోసం…అయితే, ఆ సమయంలో అమర్చిన పైపులు చాలా చిన్నవిగా ఉండడంతో పాటు, కాలక్రమేణా వాటిలో మట్టి, చెత్తాచెదారం పేరుకుపోయాయి. ఫలితంగా మురుగునీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడి, మళ్లీ పాత సమస్యే పునరావృతమైంది. ప్రస్తుతం డ్రైనేజీలన్నీ జామ్ అయిపోయి మురుగునీరు రోడ్లపై ఏరులై పారుతోంది.

అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం గ్రామంలో ప్రజలు పడుతున్న అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు అధికారుల దృష్టికి వెళ్లినా కనీస స్పందన లేదని గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీటి కారణంగా దోమలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత ప్రత్యేక అధికారి స్పందించి రెడ్డివారిపల్లిలో పేరుకుపోయిన డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, పెద్ద పైపులతో నూతన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని గ్రామస్థులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.