prajaseema.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 1:22 pm Digital Edition : PRAJA SEEMA DESK

హక్కులకై కదం తొక్కిన శ్రామిక వర్గం – సమ్మె విజయవంతం

– నల్ల చట్టాలతో ప్రజల హక్కుల హత్య

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదు

– సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు

మదనపల్లి ఫిబ్రవరి 12( నేటి పత్రిక ప్రజాసీమ ప్రతినిధి): 44 కార్మిక చట్టాల స్థానే తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక హక్కులు కాపాడాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని కోరుతూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె మదనపల్లిలో విజయవంతం అయ్యింది. గురువారం దేశావ్యాప్త సమ్మె సందర్భంగా పట్టణంలో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. బెంగళూరు రోడ్డు, ఆనిబిసెంట్ సర్కిల్, మల్లికార్జున సర్కిల్, బెంగళూరు బస్టాండ్, సుందరయ్య సర్కిల్, చిత్తూరు బస్టాండ్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ప్రదర్శన ఆద్యంతం లేబర్ కోడ్ లు రద్దు చెయ్యాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దరించాలి, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గురయించాలని, విద్యుత్ సంస్కరణలు రద్దు చెయ్యాలి, రైతులకు గిట్టుబాటు ఇవ్వాలి, ప్రభుత్వ సంస్థలు పరిరక్షంచాలి అంటూ నినాదాలు హోరేట్టించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద సభ జరిగింది. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఇప్పటివరకు ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్మికులను మరింతగా దోచుకునే విధంగా లేబర్ కోడ్లు రూపొందించారని బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలు చేయడం ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనమని అన్నారు. విద్యుత్ సవరణ బిల్లు, విత్తనాల సవరణ బిల్లులను కూడా పార్లమెంటులో ఆమోదింపజేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. లేబర్ కోడ్ల ద్వారా వేతనాల నిర్ణయంలో ఉన్న త్రైపాక్షిక విధానాన్ని రద్దు చేసి, ‘ఒకే దేశం ఒకే వేతనం’ పేరుతో రోజుకు రూ.178 కనీస వేతనం నిర్ణయించడం ద్వారా కార్మికుల ఆదాయం తగ్గే పరిస్థితి ఏర్పడిందని, అలాగే పని గంటలను 8 నుంచి 12కు పెంచి, ఓవర్‌టైంకు అదనపు వేతనం చెల్లించకుండా చేస్తున్నారని, ట్రేడ్ యూనియన్ నమోదు నిబంధనలను కఠినతరం చేసి, కార్మికుల సంఘటిత శక్తిని దెబ్బతీస్తున్నయని పరిశ్రమల లేఆఫ్‌, లాకౌట్‌, మూసివేతలకు సంబంధించిన నిబంధనలను సడలించి, యజమానులకు అనుకూలంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్‌, బోనస్ వంటి హక్కులను కాంట్రాక్ట్ కార్మికుల నుంచి క్రమంగా తొలగించే విధంగా కోడ్లు రూపొందించారని అనేక రాష్ట్రాల్లో ఉన్న కార్మిక సంక్షేమ బోర్డులను రద్దు చేసి, కార్మికుల విద్య, వైద్యం, వివాహ, ప్రసూతి సహాయాలను నిలిపివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లు ప్రకటించినప్పటికీ దొడ్డిదారిగా అమలు చేస్తున్నారని వివరించారు. రైతుకు గిట్టుబాటు ధర లేకుండా ఎరువులు పురుగుమందులు విత్తనాలు దారుల పెంచి రైతులకు మోసం చేస్తుందని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా లేకుండా పోయిందని లేబర్ కోడ్ల ద్వారా తనిఖీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, కార్మికులకు శిక్ష యజమానులకు రక్ష అనే విధానాన్ని అమలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పార్లమెంటులో టీడీపీ, జనసేన, వైఎస్ఆర్‌సీపీ పార్టీలు ఓటు వేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి టి.హరిశర్మ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్వరి, ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి, ఆశా కార్యకర్తల సంఘం జిల్లా నాయకురాలు హారిక, మధ్యాహ్నం భోజనం సంఘం జిల్లా నాయకురాలు రెడ్డెమ్మ, వివోఏ జిల్లా అధ్యక్షులు రెడ్డెప్ప రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి. ప్రభాకర్ రెడ్డి, బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు రవికిరణ్, ఎన్జీఓ సంఘం నాయకులు వేణుగోపాల్, రెడ్డి శేఖర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రామకృష్ణ, ఆర్పీ ఉద్యోగుల సంఘం నాయకురాలు జ్యోతి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మక్ధూమ్ బాషా తదితరులు ప్రశాంగించారు. వేలాదిమంది కార్మికులు పాల్గొన్నారు.