prajaseema.com
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 8:21 am Digital Edition : PRAJA SEEMA DESK

స్వచ్ఛమైన ఖర్జూరాలకు ఎగబడుతున్న ఖర్జూర ప్రియులు

స్వచ్ఛమైన ఖర్జూరాలకు ఎగబడుతున్న ఖర్జూర ప్రియులు

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం: పుల్లంపేట మండలం వత్తలూరు రోడ్డులోని సాదువారిపల్లి సమీపంలో ఉన్న ఖర్జూర తోటకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ తోటలో స్వచ్ఛమైన, తాజాగా కోసిన ఖర్జూర పండ్లు అందుబాటులో ఉండటంతో స్థానికులతో పాటు రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల నుంచి కూడా ఖర్జూర ప్రియులు తోటను సందర్శిస్తున్నారు. తమకు నచ్చిన గెలలను స్వయంగా కోసుకుని రుచి చూసి కొనుగోలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తోట యజమాని తెలిపిన వివరాల ప్రకారం, ఆరు సంవత్సరాల వయస్సు కలిగిన ఖర్జూర మొక్కలను తమిళనాడు రాష్ట్రంలోని సేలం నుంచి తెప్పించి నాటారు. ఒక్కో మొక్కకు సుమారు రూ.12 వేల వరకు ఖర్చు అయిందని, ప్రస్తుతం చెట్లకు దాదాపు పది సంవత్సరాల వయస్సు ఉందని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా మంచి దిగుబడి వస్తోందని, కొంత రాతి నేల ఉన్నప్పటికీ పండ్ల నాణ్యత, రుచి ఎంతో మెరుగ్గా ఉందని చెప్పారు.

మొత్తం 80 ఖర్జూర మొక్కలను నాటామని, ఇప్పటికీ పెట్టుబడి పూర్తిగా తిరిగి రాలేదని రైతు పేర్కొన్నారు. అయినప్పటికీ నూతన పంటల సాగుపై తమకు నమ్మకం ఉందని, ఇలాంటి వినూత్న వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రభుత్వం ప్రోత్సహించి అవసరమైన సహాయం అందించాలని కోరారు.

ఖర్జూర పండ్లు కొనుగోలు చేస్తున్న ఓ కస్టమర్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఈ తోటకు వచ్చి స్వయంగా నచ్చిన గెలలను కోసుకుని కొనుగోలు చేస్తున్నానని తెలిపారు. ఇక్కడ లభించే ఖర్జూరాలు ఎంతో తాజాగా, సహజ రుచితో ఉంటాయని, తోటలోనే కోసుకుని తినడం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.