రాజంపేట పట్టణం (ప్రజాసీమ)
సమస్య మీది పరిష్కార బాధ్యత మాది అంటూ రాజంపేట నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు గల్లీ బాట పట్టారు. రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ఆయన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఈడిగ పాలెం లో ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి పలు సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించదగ్గవి అధికారులను ద్వారా వెంటనే పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. అలాగే దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రాబోయే రోజుల్లో నిధులు కేటాయించి ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామని, ప్రభుత్వం అందించే ప్రతి పథకం ప్రజలకు అందాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా రాజంపేట మున్సిపాలిటీలో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, తప్పనిసరిగా ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా నీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, ఇతర అవసరాలను తెచ్చేందుకు చర్యలు చేపడతామని, కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణానికి చెందిన అనేకమంది టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.