prajaseema.com
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 7:16 pm Digital Edition : PRAJA SEEMA

రెగ్యులర్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ లకు అవకాశాలు కల్పించకుండా ప్రభుత్వ నిర్లక్ష్యమా, స్టాండింగ్ కౌన్సిల్ నియమాకాలపై న్యాయవాదుల అసంతృప్తి

 

అమరావతి, ప్రజాసీమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ నియామకాల విధానంపై హైకోర్టు న్యాయవాదుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు తదితర సంస్థల్లో స్టాండింగ్ కౌన్సెల్ బాధ్యతలను ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వ ప్లీడర్లు (GPలు), అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు (AGPలు)కే అప్పగించడం వల్ల, హైకోర్టులో క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తున్న అర్హులైన న్యాయవాదులకు అవకాశాలు దక్కడం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంబేద్కరైట్స్ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. సోలోమన్ రాజు, అడ్వకేట్ పేర్కొన్నారు. ఈ అంశంపై అడ్వకేట్ జనరల్‌కు వినతిపత్రం అందజేశారు.

జి.ఓ. ఎం.ఎస్. నెం.187, తేదీ 06-12-2000 స్ఫూర్తికి అనుగుణంగా స్టాండింగ్ కౌన్సెల్ నియామకాలు చేపట్టాల్సి ఉండగా, ఆచరణలో అలా జరగడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. కొద్దిమంది వద్దే ప్రభుత్వ బ్రీఫ్‌లు కేంద్రీకృతమవడం వల్ల వందలాది అర్హులైన రెగ్యులర్ ప్రాక్టీసింగ్ న్యాయవాదులు వృత్తిపరమైన అవకాశాలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అర్హత, ప్రతిభ, అనుభవం కలిగిన రెగ్యులర్ ప్రాక్టీసింగ్ న్యాయవాదులను స్టాండింగ్ కౌన్సెల్‌లుగా నియమిస్తే ప్రభుత్వ న్యాయ వ్యవహారాల్లో పారదర్శకత, సమాన అవకాశాలు, నాణ్యత పెరుగుతాయని ఎం. సోలోమన్ రాజు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రస్తుత నియామక విధానాన్ని సమీక్షించి, ఖాళీలను అర్హులైన న్యాయవాదులతో భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.