-మిన్నల్ రవి,డా.యం.ఉమేష్ రావు
శ్రీకాళహస్తి నేటిపత్రిక ప్రజాసీమ: గత వైసిపి ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలకు మరియు ధార్మిక సంస్థలకు రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేసి, మహాపచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి మరియు తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు విజ్ఞప్తి చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తినేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలలో ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేసి పరమపవిత్రంగా భావించే లడ్డూ తదితర ప్రసాదాలను కల్తీ చేయడం అంత్యంత బాధాకరమని… క్షమార్హం కాని నేరం, మహాపాపం అని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసిపి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీకాళహస్తి, కాణిపాకం మరియు ద్వారకా తిరుమలలోని దేవాలయాలకు కూడా తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి డెయిరీ నుంచే నెయ్యి లాంటి అత్యంత ప్రమాదకరమైన రసాయన మిశ్రమాలను సరఫరా చేసినట్లు సిట్ విచారణ నివేదికలో పేర్కొనడం తీవ్రమైన ఆవేదనకు గురిచేస్తున్నదని తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయానికి 2022-24 మధ్యకాలంలో వైష్ణవి బ్రాండ్ నెయ్యిని సరఫరా చేసిన సుమిత్ర ట్రేడర్స్ మరియు వినాయక ఏజెన్సీస్ వారి కల్తీ నిర్వాకాన్ని అటు భక్తులు గాని, ఇటు ఆలయ పోటు సిబ్బంది గాని అధికారులకు తెలియజేసే ప్రయత్నాలను పాలకులు ఎప్పటికప్పుడు తొక్కి పెట్టి, తీవ్రమైన ఆధ్యాత్మిక ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. శ్రీకాళహస్తి ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ విచారణలో బహిర్గతం అయినందున, దీనికి కారకులైన కల్తీ నెయ్యి సరఫరా గుత్తేదారు సుమిత్ర ట్రేడర్స్ మరియు వినాయక ఏజెన్సీస్ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి గుత్తేదారులకు సహకరించిన నాటి ధర్మకర్తల మండలి పైన, అలాగే కార్యనిర్వాహక అధికారుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జరిపిన ఆర్థిక లావాదేవీ లపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ తమ విచారణలో “జగన్ కల్తీ ముఠా” హవాలా వ్యవహారం వెలుగులోకి రావటంతో, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగిందని, దీని ద్వారా కల్తీ నెయ్యి అసలు సూత్రధారులు బయటకు వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి,తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్,తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంటు బిసి విభాగం నాయకులు గంగనపల్లి రమేష్,కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.