prajaseema.com
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 3:47 pm Digital Edition : PRAJA SEEMA DESK

అన్నమయ్య జిల్లాను వ్యర్థ రహిత జిల్లాగా మార్చాలి; జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

 

మదనపల్లి,(ప్రజా సీమ)

జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు వ్యర్థ రహిత (జీరో వేస్ట్) కేంద్రాలుగా మారాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు అందరూ కలిసి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు.శనివారం మదనపల్లి పట్టణంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా శుభ్రమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని తెలిపారు. ఈ నెలకు “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్” అనే అంశాన్ని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి అనుగుణంగా విద్యాసంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో వ్యర్థాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, వాటిని సరైన విధంగా వేరు చేసి నిర్వహించకపోతే పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, హానికర వ్యర్థాలను వేర్వేరు చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు.ఇంజినీరింగ్ కాలేజీలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్, క్యాంటీన్ వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని, ప్రతి సంస్థ తమకు సంబంధించిన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ రథాల ద్వారా ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి, వాటికి బదులుగా నగదు లేదా వస్తువులు అందించే విధానం అమల్లో ఉందని తెలిపారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.పర్యాటక ప్రదేశాలు, అడవుల్లో చెత్త పారవేయడం వల్ల కాలుష్యం పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా శుభ్రతను పాటించాలని సూచించారు. శుభ్రత ఒక రోజు కార్యక్రమం కాకుండా రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని అన్నారు.విద్యార్థులు ఈ శుభ్రత సందేశాన్ని తమ కుటుంబాలకు, సమాజానికి తీసుకెళ్లి ప్రతి ఇంటిని కూడా జీరో వేస్ట్ కేంద్రంగా మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అధికారులు అందరూ కలిసి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిపిఓ రాధమ్మ, డీఎల్‌డీఓ అమర్నాథ్ రెడ్డి, ఎంపీడీవో తాజ్ మసూద్, డిప్యూటీ ఎంపీడీవో భారతి, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
———————–///—————
ఏపీఆర్ఓ, అన్నమయ్య జిల్లా